ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
* గత మూడేళ్లలో విద్యుత్ శాఖ పరిధిలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు
* ఏపీఈపీడీసీఎల్‌లో 43 మంది అర్హులకు నియామక పత్రాలు అందజేత
* త్వరలో లైన్‌మెన్ పోస్టుల భర్తీకి చర్యలు
* విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి
* 1912 కాల్ సెంటర్‌ను పరిశీలించి వినియోగదారులతో స్వయంగా మాట్లాడిన మంత్రి
విశాఖపట్నం, అక్టోబర్ 05: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచి, వారి కుటుంబ సభ్యులకు త్వరితగతిన కారుణ్య నియామకాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సంస్థలో అర్హులైన 43 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
కారుణ్య నియామకాల కోసం అర్హులైన కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో గత రెండున్నర, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియామకాలను వేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. మూడు విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు ప్రసార, ఉత్పత్తి సంస్థల్లో కలిపి ఇప్పటివరకు 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించామని చెప్పారు. ఉద్యోగిని కోల్పోయిన కుటుంబంలో కనీసం ఒకరికి ఉపాధి కల్పించడం ద్వారా ఆ కుటుంబానికి భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖలో మానవ వనరుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ఇంధన సహాయకులుగా పనిచేస్తున్న సిబ్బందిని విద్యుత్ శాఖలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,500 నుంచి 7,000 మంది వరకు సిబ్బందిని సమకూర్చుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి పది రోజులకు ఒకసారి విద్యుత్ పరిస్థితి, సిబ్బంది, సేవల పంపిణీ తదితర అంశాలపై సమీక్షిస్తున్నారని తెలిపారు.
విద్యుత్ శాఖలో సహాయ ఇంజనీర్ పోస్టులను పెంచాలని కోరగా ముఖ్యమంత్రి 629 పోస్టులను ఒకేసారి మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు పరీక్ష పూర్తయిందని, ఫలితాలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం త్వరితగతిన నియామకాలు చేపడతామని చెప్పారు. దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 85 వేల మంది పరీక్షకు హాజరయ్యారని, నియామక ప్రక్రియలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది మరింత అవసరమని మంత్రి అన్నారు. 629 సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీ అనంతరం ముఖ్యమంత్రి అనుమతితో లైన్‌మెన్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు పంపిణీ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఉపకేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త ఉపకేంద్రాలు, ప్రసార వ్యవస్థ బలోపేతం, నగర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబులింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ అందించడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపునకు విద్యుత్ శాఖ కీలకంగా పనిచేస్తోందన్నారు.
ప్రజలు విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించేలా విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పగటి సమయంలో విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాత్రి వేళల్లో, అత్యధిక డిమాండ్ సమయంలో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించవచ్చని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంతో పాటు పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును పెంచాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ చార్జీలను పెంచలేదని మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలోనూ విద్యుత్ చార్జీలు పెంచకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు హరిత విద్యుత్ ప్రసార మార్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. భద్రతా విధానాలు, విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖ సిబ్బందితో పాటు కాంట్రాక్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బందికి కూడా భద్రతా విధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగం లేదా ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొంత మేరకు అండగా నిలవగలిగినా, ఒక కుటుంబాన్ని కోల్పోయిన లోటును భర్తీ చేయలేమని, అందువల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ ప్రజల దృష్టిలో అత్యుత్తమ సేవలు అందించే శాఖగా నిలవాలని, పారదర్శకత, బాధ్యతతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని మంత్రి అధికారులను కోరారు.
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఏపీఈపీడీసీఎల్ పరిధి 12 జిల్లాల్లో విస్తరించి ఉందని, సుమారు 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, అనారోగ్యానికి గురైన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. 2024లో 37 మందికి, 2025లో 77 మందికి, 2026లో ఇప్పటివరకు 43 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో ప్రమాదాలు, మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు సంస్థ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారుణ్య నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా కార్యక్రమానికి హాజరై నియామక పత్రాలు అందజేయడం అభినందనీయమన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో విద్యుత్ శాఖ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించిందని, ప్రస్తుతం భూగర్భ కేబులింగ్ సహా విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ శాఖకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, పార్లమెంటు ఇంధన కమిటీలో సభ్యుడిగా ఉన్న తనకు విద్యుత్ రంగంతో మరింత ప్రత్యక్ష సంబంధం ఏర్పడిందన్నారు. పగటి సమయంలో విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు తమ వృత్తికి, కుటుంబానికి న్యాయం చేసేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సంస్థ డైరెక్టర్లు టి.వి. సూర్యప్రకాష్, టి. వనజ, ఎస్. హరిబాబు, సీజీఎంలు, ఎస్ఈలు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.